ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేయనున్న ఐఏఎస్ అధికారి సమీర్ శర్మకు ప్రభుత్వం రెండు పోస్టులు సిద్ధం చేసి పెట్టింది. సిఎస్ గా ఎప్పుడో పదవి విరమణ పొందాల్సిన ఆయన ఇప్పటికే రెండుసార్లు సర్వీసు కొనసాగింపు పొందారు. ఇక తాజాగా, సిఎస్ గా ఈ నెల 30వ తేదీన పదవి విరమణ చేయనున్న సమీర్ శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్ట్ సృష్టించింది.
సమీర్ శర్మ పదవి విరమణ అనంతరం ఆయనను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియమించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమీర్ శర్మ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టించారు. మరోవైపు ప్రణాళిక విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఉన్న విజయ్ కుమార్ బుధవారం పదవి విరమణ చేయనున్నారు. ఆయన కోసం కూడా కొత్త పోస్ట్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ కుమార్ ను స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా నియమించారు.