తెలంగాణలో రోజురోజుకూ దయనీయంగా మారుతున్న కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నేతలు కొత్త వ్యూహం రచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని ఎలా దర్వినియోగం చేశారో, కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రజలకు చెబుతామని అంటున్నారు.
ఈ మేరకు సోమవారం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇదే అదనుగా ప్రజల్లోకి వెళ్లి బలపడాలని చూస్తున్నారు.
నిజానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ్మిడిహట్టి వద్ద గోదావరి నదిపై ప్రాణహిత-చేవేళ్ల సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లాకు కూడా నీటిని అందించవచ్చంటూ డిజైన్ రూపొందించారు. అయితే.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం.. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు.
తమ్మిడిహట్టి వద్ద కాకుండా.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని డిజైన్ చేయడం.. గత జూలై 21న ప్రాజెక్టును ప్రారంభించడం కూడా జరిగిపోయింది. అయితే.. తాము ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేవలం రూ.30వేల కోట్లతో రూపొందించాలని ప్రతిపాదించామని, కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సుమారు రూ.80వేల కోట్లను ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి అన్నారం బ్యారేజ్‌లోకి నీటిని పంపింగ్ చేశారు.
అయితే.. కేవలం మూడు నాలుగు మోటార్లు నడిస్తేనే.. నెల రోజుల్లో సుమారు 12 కోట్లరూపాయ కరెంటు బిల్లు వచ్చిన విషయం బయటకు రావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇదే అదనుగా కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రీ డిజైన్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద తప్పిదం చేశారని, వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే లాభం కన్నా నిర్వహణ భారమే అధికంగా ఉంటుందనే టాక్ ప్రజల్లోకి కూడా సోషల్ మీడియా ద్వారా వేగంగా వెళ్లింది.
ఇప్పుడు ఇదే అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రద్దు చేసినందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు.
అలాగే.. ఉదయ సముద్రం ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈనెల 26 నుంచి మూడురోజుల పాటు పాదయాత్ర చేయబోతున్నారు. అంతేగాకుండా.. ప్రాజెక్టులపై సీబీఐ విచారణను కోరుతామని కాంగ్రెస్ నేతలు గట్టిగానే చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు కాంగ్రెస్ నేతలు రచిస్తున్న వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి.