దిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్‌లో దిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి.
రానున్న 5 రోజుల్లో దిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయవ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.