నేటి నుంచి దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు

-

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇవాళ్టి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలోని ప్రభుత్వ అధికారుల బృందం ఆదివారం రోజునే దావోస్​ చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కేటీఆర్‌ హాజరుకావడం ఇది అయిదోసారి. గతంలో 2018, 2019, 2020, 2022 సంవత్సరాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు.

ఈసారి ‘భిన్న ప్రపంచంలో సహకారం’ అనే నినాదంతో సదస్సు జరుగుతోంది. ఇందులో మంత్రి కేటీఆర్‌ కీలక ప్రసంగం చేస్తారు. చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. పారిశ్రామిక సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు పలు అవగాహన ఒప్పందాలు చేసుకునే వీలుంది.

ఈ సదస్సుకు దాదాపు 52 దేశాల అధినేతలు హాజరవుతున్నారు. 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని.. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతారు. భారత్​ నుంచి కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్‌, స్మృతి ఇరానీ, ఆర్‌కే సింగ్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, పలువురు సీఎంలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news