అత్యాచార బాధితురాలితో వివాహం జరిపించడానికి జైలులో ఉన్న నిందితుడికి ఉత్తరాఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైనర్‌ను వివాహం చేసుకునేందుకు 24 ఏళ్ల నిందితుడికి ఆరు వారాల స్వల్ప కాలిక బెయిల్ జారీ చేసింది. బాధితురాలిపై గతంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ఆమె 2021 సెప్టెంబర్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా బాధితురాలికి మైనారిటీ తీరడం వల్ల ఆమెను పెళ్లి చేసుకునెందుకు సిద్ధమయ్యాడు నిందితుడు. ఇందుకోసం అనుమతినివ్వాలని కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన ఆరు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది.
అసలేం జరిగిందంటే.. 2021 జనవరిలో నైనీతాల్కు చెందిన 15 ఏళ్ల బాలికపై చంపావత్ జిల్లాకు చెందిన యువకుడు అత్యాచారం చేసి తల్లిని చేశాడనే ఆరోపణలతో 2021 సెప్టెంబర్ 13న నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబరులో బాధిత గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఘటన జరిగిన సమయానికి బాధితురాలు మైనర్ అని ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు నిండాయని, దీంతో ఇద్దరికి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి.
ఇందుకోసం నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇరు వర్గాల వాదనలు వింటున్న సమయంలో బాధితురాలు 2021 జనవరిలో పరస్పర అంగీకారంతోనే నిందితుడితో శృంగారంలో పాల్గొన్నానని అందువల్లే తనకు గర్భం వచ్చిందని కోర్టుకు వివరించింది. ఇది విన్న జిల్లా కోర్టు బెయిల్ అప్పీల్‌ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. జనవరి 25న షరతులతో కూడిన ఆరు వారాల స్వల్పకాలిక బెయిల్‌ను మంజూరు చేసింది.