ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మండ మెలిగే పండుగగా పిలిచే మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రెండు రోజుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల దర్శనానికి వస్తున్నారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు.
మేడారం మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మండ మెలిగే పండుగ పేరుతో చిన్న జాతర నిర్వహిస్తారు. పెద్ద జాతరలో దర్శనానికి రాలేని భక్తులు… ఈ జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెలపై చలువ పందిళ్లు వేశారు.
భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. జంపన్న వాగుకు ఇరువైపులా స్నాన ఘట్టాలు, జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల సౌకర్యాలు కల్పించారు. మినీ జాతరలో నాలుగు నుంచి ఐదున్నర లక్షల మంది భక్తులు తల్లుల దర్శనానికి వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు.