వైసిపి సర్కార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో బుగ్గనకు తెలుసా..? అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ పై పెత్తనమంతా ముఖ్యమంత్రి దే కాబట్టి జగన్ తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
వైసీపీ మూడున్నర ఏళ్ల పాలన పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు యనమల. బహిరంగ మార్కెట్ లో చేసిన అప్పు ఎంత? చెల్లించిన వడ్డీ ఎంత? పెండింగ్ బిల్లులు ఎన్ని? ఉద్యోగులకు జీతాలు, పిఆర్సి ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది? ఎన్ని కోట్లు దారి మళ్ళాయి అంటూ వరుస ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీశారు.