పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రేపు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను పంజాబ్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం అధ్యయనం చేయనుంది. ఆయనతో పాటు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్లు కూడా రానున్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం, ఆయన బృందం పరిశీలించనుంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం తదితరాలు, వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో ఈ బృందంలోని అధికారులు అధ్యయనం చేయనున్నారు. పంజాబ్లో భూగర్భ జలాల కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో కొన్నింటిని పరిశీలించే అవకాశం ఉంది.