టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు. గతరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేసరికి కోర్టు సమయం ముగియడంతో ఈ ఉదయం తిరిగి గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పట్టాభిని హాజరుపరిచారు. వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఆయన్ను గన్నవరం సబ్‌జైలుకు పంపాలని ఆదేశించారు.
తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మంగళవారం రోజున పట్టాభి న్యాయమూర్తి ఎదుట తన గోడు వెల్లబోసుకుున్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇవాళ వైద్య నివేదిక పరిశీలించాక గన్నవరం సబ్ జైలుకు పట్టాభిని తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరగా.. ఆ అభ్యర్ధనను న్యాయస్థానం తిరస్కరించింది. ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.