దేశంలో రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని, నిరుద్యోగం కూడా పెరిగిపోతోందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో తోటచంద్రశేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కి ఇంతవరకు రాజధాని లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని అన్నారు.
విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న దేశంలో తాగు, సాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పై కేంద్రానికి పట్టు లేదని విమర్శించారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో అన్ని రాష్ట్రాలలోనూ అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు.