బయో ఆసియా సదస్సు వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా తాజాగా రూ.500 కోట్ల పెట్టుబడితో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సంస్థను నెలకొల్పనున్నట్లు ప్రఖ్యాత ఎస్‌జీడీ, కోర్నింగ్ సంస్థలు ప్రకటించాయి. రూ.200 కోట్లతో ఇప్పటికే స్థాపించిన తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఫాక్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆదివారం ఆయా సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో ఈమేరకు చర్చలు జరిపి, పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. వీటితోపాటు తెలంగాణలో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మరో దిగ్గజ సంస్థ ‘పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ (పీఎస్‌ఎల్)’ ప్రకటించింది.
బయో ఆసియా సదస్సులో భాగంగా ఇప్పటికే.. అమెరికాకు చెందిన జూబిలెంట్ సంస్థ రూ.1,000 కోట్లు, ఫ్రాన్స్ సంస్థ సనోఫి రూ.250 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 24న ప్రారంభమైన బయో ఆసియా సదస్సు వేడుకలు ఆదివారంతో ముగిశాయి. జీవ ఔషధ సంస్థలు తమ అధునాతన, ప్రయోగాత్మక ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాయి.