స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో డీలా పడిపోయిన నోకియాను చేజిక్కించుకున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నోకియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల తర్వాత కంపెనీ కొత్త లోగోను డిజైన్ చేసింది. కంపెనీ కొత్త లోగోలో నోకియా అనే పదంలోని ఐదు అక్షరాలని వేర్వేరు రూపాల్లో రూపొందించారు. ఈ లోగో కంపెనీకి సరికొత్త వ్యాపార ప్రణాళికలను అందించడానికి సహాయపడుతుందని కంపెనీ సీఈవో పెక్కా లుండ్మార్క్ వెల్లడించారు.
బార్సిలోనాలో సోమవారం రోజున ప్రారంభమైన వార్షిక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో.. కంపెనీ వ్యాపార విస్తరణకు సంబంధించి సరికొత్త ప్రణాళికను వెల్లడించనున్నట్లు లుండ్మార్క్ తెలిపారు. 2020లో కష్టాల్లో ఉన్న నోకియా కంపెనీ అధికారిక పగ్గాలు చేపట్టాక మూడు కీలక మార్పులకు వ్యూహాలు రచించినట్లు లుండ్మార్క్ చెప్పారు. రీసెట్, వేగవంతం చేయడం, అభివృద్ధి బాట పట్టించడం.. ఇందులో మొదటి దశ పూర్తి కావడం వల్ల ప్రస్తుతం రెండో దశ ప్రారంభమవుతోందని అన్నారు.