శ్రీరామనవమి సమీపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాముడి ఆలయాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వైభవంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా భద్రాద్రి రామయ్య కోవెలలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. అనివార్య కారణాలతో ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తుల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. గతంలో మాదిరే కల్యాణత్సోవంలో పరోక్ష పద్ధతిలో భక్తుల గోత్రనామాలు పఠించనున్నట్లు వెల్లడించారు. కల్యాణోత్సవం, సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలకు హాజరవలేనివారు ఇప్పటి నుంచే www.bhadrachalamonline.com వెబ్సైట్ ద్వారాగానీ, రామాలయ కార్యాలయంలోగానీ పరోక్ష పూజా టిక్కెట్లను పొందాలని సూచించారు. రూ.5 వేల టిక్కెట్‌పై మూలవరుల శాలువా, కుంకుమ, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, మిస్రీ ప్రసాదం అందించనున్నారు.