కాంతార సినిమాతో కన్నడ హీరో, డైరెక్టర్ రిషభ్ శెట్టి పాన్ ఇండియా గుర్తింపు పొందారు. అయితే తాజాగా రిషభ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన రాజకీయాల్లోకి రానున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఇటీవలే రిషభ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. ఈ నేపథ్యంలోనే రిషభ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే, పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకే సీఎంను కలిశానని రిషబ్ శెట్టి తెలిపారు. తాను కాంతార సినిమా చేసేటప్పుడు అడవుల్లో తిరిగానని.. దానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించానని చెప్పారు.
“నేను కాంతార చేసేటప్పుడు అడవుల్లోని ప్రజలను కలిశాను. వీరితో పాటు అటవీ అధికారులను కలిసే అవకాశం కూడా వచ్చింది. అడవుల్లో మంటలు లాంటి అనేక సమస్యలు నా దృష్టిలోకి వచ్చాయి. వీటన్నింటిని కలిపి 20 పాయింట్లతో వినతి పత్రాన్ని సమర్పించాను. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు గర్వంగా ఉంది.” – రిషభ్ శెట్టి, నటుడు