దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు దిల్లీకి చేరుకున్నారు. కవితకు మద్దతుగా తుగ్లక్ రోడ్‌లోని సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకుని నినాదాలు చేశారు. కవితకు సంఘీభావం తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వంపై, మోదీపై, బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు.
గత 3 రోజులుగా కవిత కేసీఆర్ నివాసంలోనే ఉంటున్నారు. ఇవాళ ఉదయం ఆమె తుగ్లక్ రోడ్ నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఆ కార్యాలయం ఎదుట భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా దిల్లీ పోలీసులు ముమ్మర భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు ఆర్ధరాత్రి వరకు న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం.