మయన్మార్లో సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య భీకర పోరు జరిగింది.ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు. దక్షిణ షాన్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమంలో శనివారం రోజున సైన్యం మద్దతు గల జుంటాకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ మరణకాండకు సంబంధించిన ఫొటోలు ఇటీవల సామాజిక మధ్యమాల్లో విడదలయ్యాయి. రక్తం మడుగులో మృతుల శరీరాలు పడి ఉన్నాయి. అందులో బుద్ధ సన్యాసులు కూడా ఉన్నారు. మఠం సైతం తూటాల రంధ్రాలతో నిండిపోయింది.
“మృతులకు గాయపడిన వారికి తల భాగంలో, ఇతర భాగాల్లో బుల్లెట్లు తగిలాయి. ఇప్పటి వరకు 22 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన ఏడు మృతదేహాలు ఆశ్రమం వద్దే ఉన్నాయి. వాటిని తీసుకువచ్చేందుకు వీలు కావట్లేదు.” అని మయన్మార్ అధికారులు తెలిపారు.