ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఏడవ రోజు సోమవారం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుండి సభలో టిడిపి సభ్యులు ఆందోళన, వారిని సస్పెండ్ చేయడం నిత్య కృత్యంగా జరుగుతుండగా.. నేడు ఘర్షణ వరకు దారితీసింది. సభలో టిడిపి ఎమ్మెల్యే డోల, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జీవో నెంబర్ 1 ను రద్దు చేయాలటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టిడిపి.. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు పట్టింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుమట్టారు టిడిపి సభ్యులు. అయితే ఇక్కడ ఘర్షణకు దారితీసింది. అయితే అసెంబ్లీలో నేడు జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని కోరారు. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందన్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని, అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.