ఇటీవల ఓ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ధరించిన నెక్లెస్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా తాప్సీపై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్ తాప్సీపై ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ఆమె లక్ష్మీదేవి నెక్లెస్‌ను ధరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా తాప్సీ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాప్సీ ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. మార్చి 2న ముంబయి వేదికగా జరిగిన ఈ షోలో ఆమె రెడ్ కలర్ ఫ్రాక్ ధరించింది. అయితే ఈ డ్రెస్‌లో తాప్సీ కాస్త క్లీవేజ్ షో చేసింది. అంతేకాకుండా లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న నెక్లెస్‌ను ధరించింది. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి లక్ష్మీదేవి నెక్లెస్ వేసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాప్సీ డ్రెస్సింగ్ పట్ల అసహనం వ్యక్తం చేసిన ఏకలవ్య గౌర్.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు.