IPL 16వ సీజన్లో భాగంగా ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్-దిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం రోజున మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్.. దిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్‌ను వీక్షిస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ‘మిస్ యూ పంత్’.. ఆర్పీ 17 అంటూ బ్యానర్లు, ఫ్లకార్డులు పట్టుకుని కనిపించారు.
ఈ మ్యాచ్‌లో షార్ట్, వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్.. కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. ఫ్యాన్స్‌కు హాయ్ చెబుతూ.. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్ డగౌట్ వైపు చిరునవ్వుతో చూశాడు. పంత్‌ను చూసిన సౌరవ్ గంగూలీ, హెడ్‌కోచ్ పాంటింగ్ సహా దిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రిషభ్ పంత్. గాయాల వల్ల జాతీయ జట్టు ఆడే మ్యాచులతో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అతడు మెల్లగా కోలుకుంటున్నాడు. పంత్‌ను మిస్ అవుతున్నట్లు.. దిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే పలుసార్లు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్ తమతో ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆ జట్టు హెడ్ కోచ్ పాంటింగ్ అన్నాడు.