జగన్ నియోజకవర్గం.. జూదాలకు నిలయమా..?

-

పులివెందుల.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నియోజక వర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. రాయలసీమలో ముఖ్యమంత్రులను అందించిన నియోజక వర్గం ఇది. గతంలో ఇక్కడి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా వైఎస్ జగన్ ఇక్కడి నుంచి గెలిచి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలుగు దేశం నేతలు జగన్ సొంత నియోజక వర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

ఈమధ్య మాజీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా జగన్ రాష్ట్రమంతటా పులివెందుల పంచాయతీలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. పులివెందుల పంచాయితీ అన్న పదాన్ని కొత్తగా కాయిన్ చేశారు చంద్రబాబు. అంతకు ముందు కూడా కడప రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో రచ్చ చేసింది.

అలా మొత్తానికి పులివెందుల అంటే అరాచకాల అడ్డా అనే ఇమేజ్ తెచ్చేందుకు తెలుగు దేశం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు తెలుగు దేశం నేత వర్ల రామయ్య మరో సంచలన ఆరోపణ చేశారు. అదేంటంటే పులివెందుల జూదాల అడ్డగా మారిందట. అమెరికాలోని లాగ్ వెగాస్ కేసినోల అడ్డా తరహాలో ఇప్పుడు పులివెందులలో జూదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోందట. రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పుడు జూదరులు పులివెందులకు వెళ్తున్నారట.

పులివెందులలో రోజూ కనీసం 12 కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్ జరుగుతోందట. జూదాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వర్ల రామయ్య విమర్శించారు. చివరకు మహిళల తాళిబొట్లు జూదం మంటల్లో కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వర్ల రామయ్య. తాజాగా ఓ జూద గృహంపై దాడి చేసిన ఎ‌స్‌ఐని వైసీపీ నాయకుడొకరు పోలీసుస్టేషన్‌లోనే బెదిరించి జూదగాళ్లను బయటికి తీసుకెళ్ళారని కూడా వర్ల రామయ్య అన్నారు. మరి ఇందులో నిజానిజాలేంటో ప్రభుత్వమే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news