టీడీపీకి, పార్టీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, యువ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సోమవారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడైన వీరేందర్ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.అయితే తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపించారు. ఈ క్రమంలోనే తాను టీడీపీని వీడటానికి గల కారణాలను వీరేందర్ గౌడ్ తన లేఖలో వివరించారు. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని లేఖలో విమర్శించారు.
ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం ఎంతోగానో తనను బాధించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా..’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, వీరేందర్ గౌడ్ అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టిక్కెట్ కోసం ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చివరకు మహాకూటమి తరఫున పోటీ చేసినా గెలుపు దక్కలేదు.