దేశవ్యాప్తంగా రహదారులపై ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇంతకుముందు హెల్మెట్ ధరించకపోయినా.. లైసెన్స్ లేకపోయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరించే పోలీసులు గత కొన్నేళ్లుగా నిబంధనలు కఠినతరం చేశారు. డ్రైవింగ్ చేసే వారే కాదు.. బైక్పై వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలనే రూల్ పెట్టారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్.. ఇలా అనేక నియమాలను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడమే కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షలు కూడా విధిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 2022లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిలో 4.73 కోట్ల మందికి చలాన్లు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ ఏడాదిలో మొత్తంగా రూ.7563.60 కోట్లను జరిమానాలుగా విధించినట్లు తెలిపింది. 2021లో 4.21 కోట్ల చలాన్లు జారీ చేయగా.. వీటి మొత్తం విలువ రూ.5318 కోట్లని పేర్కొంది.
పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. 2022లో రూ.7563 కోట్ల జరిమానాలు విధించినా అందులో రూ.2874 కోట్లే వసూలైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మిగతా రూ.4654 కోట్లు వసూలు కావాల్సి ఉందని తెలిపారు.