తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల వల్ల..బిఆర్ఎస్ లోని పోరు హైలైట్ కావడం లేదు గాని..అంతర్గతంగా పార్టీలో చాలా రచ్చ జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే డోర్నకల్ స్థానంలో కూడా ఇద్దరు సీనియర్ల మధ్య రచ్చ ఎప్పటినుంచో జరుగుతుంది. ఇక ఇప్పుడు మరోసారి ఆ పోరు బయటపడింది.
డోర్నకల్ లో రెడ్యా నాయక్‌కు ఎక్కువ పట్టున్న విషయం తెలిసిందే. గతంలో ఈయన కాంగ్రెస్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. కానీ 2009 ఎన్నికల్లో రెడ్యా..టిడిపి నుంచి పోటీ చేసిన సత్యవతి రాథోడ్ చేతుల్లో ఓడిపోయారు. ఇక తెలంగాణ వచ్చాక సత్యవతి బిఆర్ఎస్ లో చేరిపోయారు. అటు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి రెడ్యా నాయక్ బిఆర్ఎస్ లో చేరారు. ఇలా ఒకప్పుడు రాజకీయ శత్రువులు మాదిరిగా తలపడిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే పార్టీలోకి వచ్చారు.
ఇక 2018 ఎన్నికల్లో రెడ్యా బిఆర్ఎస్ నుంచి డోర్నకల్ లో గెలవగా, సత్యవతికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలాగే ఆమెకు అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో డోర్నకల్ లో మంత్రి వర్గం హవా పెరిగింది. దీన్ని ఎమ్మెల్యే వర్గం తట్టుకోలేకపోతుంది. ఇక ఒకరినొకరు చెక్ పెట్టుకునే విధంగా రాజకీయం చేస్తున్నారు.
అయితే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని సత్యవతి కూడా చూస్తున్నారు. దీంతో అసలు రచ్చ మొదలైంది. ఇదే క్రమంలో తాజాగా రెడ్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఇంటి దొంగలు ఉన్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని, తానెప్పుడు చస్తానా అని.. కొందరు తన చావు కోసం ఎదురు చూస్తున్నారని, వాళ్లు తన ఓటమి కోసం గతంలో పనిచేశారని.. భవిషత్తులోనూ పనిచేస్తారని పరోక్షంగా సత్యవతిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. మొత్తానికి డోర్నకల్ లో రెడ్యా, సత్యవతిల మధ్య పంచాయితీ వల్ల బిఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది.