ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. మోదీ పర్యటనపై అధికార పక్షంతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు మండిపడుతున్నాయి. ఈసారి కూడా ప్రధాని రాష్ట్రానికి ఉత్త చేతులతోనే వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు మోదీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు స్పందించారు. ప్రధాని పర్యటన రాజకీయ పార్టీ పర్యటనగా మారిందని అన్నారు. ఆయన పర్యటనలో ప్రొటోకాల్ పాటించట్లేదని మండిపడ్డారు. గతంలో ప్రధాని పర్యటనకు వస్తే స్థానిక ఎంపీల పేర్లు ఆహ్వాన పత్రికల్లో ఉండేవని.. కానీ నరేంద్ర మోదీ పర్యటనల్లో పాత ఆనవాయితీ కనిపించడం లేదని దుయ్యబట్టారు.
ప్రధాన మంత్రి పర్యటన దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని ఎంపీ కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమానికి, అధికార కార్యక్రమానికి తేడా లేకుండా చేశారని మండిపడ్డారు. రెండింటినీ కలిపి రాజకీయ కార్యక్రమంగా చేయడం బాధాకరమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంపై నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.