నేడు సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు మద్దతు తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యదర్శుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని శాఖల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు బండి సంజయ్. పంచాయతీ కార్యదర్శులు తల్చుకుంటే ప్రభుత్వం సంగతి ఏమైతదో తెలుసుకోవాలన్నారు.
గొడ్డు చాకిరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు తెచ్చారని.. ఎక్కడ లేని విధంగా నాలుగేళ్లు ప్రొబేషనరీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన ఇంకా ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఎన్నికలకు ఐదు నెలల సమయం ఉందని.. కేసీఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. పంచాయతీ కార్యదర్శుల ఉద్యమానికి బీజేపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందన్నారు. పంచాయతీ కార్యాదర్శులను వేధిస్తే ఊరుకోమని.. వారి తరఫున మేము పోరాడతము.. జైల్ కి పోవడానికి సిద్ధమన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. తాము అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామన్నారు. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆర్టీసీ, సింగరేణి కార్మికులు కూడా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.