తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగాయి. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా వరుణుడు విరుచుకుపడటంతో కనబడకుండా పోయిన భానుడు.. గత రెండు రోజుల నుంచి తన ఉగ్ర రూపం చూపుతున్నాడు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుని ప్రతాపానికి ఉదయం 10 గంటల నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితం అవుతుండగా.. మధ్యాహ్నం వీచే వడగాలులకు చంటి పిల్లలు, వయో వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తర తెలంగాణలో నెల రోజులుగా సాధారణం కన్నా తక్కువ నమోదైన ఉష్ణోగ్రతలు గత రెండ్రోజుల నుంచి ఒక్కసారిగా మారిపోయాయి.
రాష్ట్రంలో గరిష్ఠంగా కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో శుక్రవారం రోజున 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ 12 నుంచి మే 12 మధ్య ఇదే అత్యధికమని వాతావరణ నిపుణులు అంటున్నారు. పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ప్రస్తుతం 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.