జగన్ ప్రభుత్వం గోనె సంచుల కుంభకోణానికి పాల్పడుతుందని ఆరోపించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్రం గోనే సంచులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత సంచులను రైతులకు ఇస్తుందని మండిపడ్డారు. కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రాష్ట్రం మాత్రం మిల్లర్లకు కొమ్ముకాస్తూ దోపిడీకి సహకరిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. అకాల వర్షాల వల్ల ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం ప్రకటించడం లేదన్నారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, అక్రమాలను చార్జి షీట్ల దాఖలు కార్యక్రమంలో బయటపడుతున్నామన్నారు. ఈ ప్రభుత్వానికి బ్రాందీ మీద ఉన్న అవగాహన ఆయుష్ మీద లేకపోవడం బాధాకరం అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా ఇన్సూరెన్స్ చేయకుండా రైతులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. అవి రైతు భరోసా కేంద్రాలు కాదని.. రైతు దోపిడీ కేంద్రాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.