కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం తరచూ సభలు, పాదయాత్రలు, సమావేశాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు పీసీసీ నేతృత్వంలో సభలతో జనానికి చేరువ కావాలని నిర్ణయించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తామని భట్టి భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భారీ సభను ఇవాళ నిర్వహించనున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జడ్చర్లలోని నేడు రాజీవ్ గాంధీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖేందర్‌సింగ్ సుఖ్, మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొననున్నారు.