గురువారం డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు.