ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పరువునష్టం దావా

-

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పరువునష్టం దావా నమోదైంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు లీజుకు సంబంధించి ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ లిమిటెడ్‌పై నిరాధార, వాస్తవదూర ఆరోపణలు చేశారంటూ ఆ సంస్థ రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తూ నోటీసులు పంపింది. ఈ నెల 25న మీడియాలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఉద్యమం చేసేవారిని ఐఆర్‌బీ చంపేస్తుందని పేర్కొన్నారని, దీంతోపాటు ఐఆర్‌బీపై పలు బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని దావాలో ఐఆర్​బీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడంతో పాటు ఐఆర్‌బీ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉన్నాయని తెలిపింది.

గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త హత్యకేసుతో ఐఆర్‌బీ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పుణె సెషన్స్‌ కోర్టు, ముంబయి హైకోర్టు కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చాయని స్పష్టం చేసింది. ఈ వాస్తవాలేవీ తెలుసుకోకుండా సంస్థ పరువును దెబ్బతీసేలా రఘునందన్‌రావు మాట్లాడారని పేర్కొంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాను బ్లాక్‌లిస్టులో పెట్టారనే వ్యాఖ్యలు కూడా పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. పలు జాతీయ ప్రాజెక్టుల్లో ఐఆర్‌బీ పెట్టుబడి భాగస్వామిగా ఉందని.. ఎక్కడా బ్లాక్‌లిస్టులో పెట్టలేదని, వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని తప్పుపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news