ఒడిశా ప్రమాదం.. మొబైల్​ లైట్ల వెలుగులో వందల మందిని కాపాడిన బహానగా ప్రజలు

-

ఒడిశా రైలు ప్రమాదం దేశంలోనే అత్యంత విషాదంగా నిలిచింది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ మిత్రబృందం చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తం చర్చనీయాంశమవుతోంది. ఆ బృందం ప్రమాదం జరగగానే అక్కడి చేరుకుంది. వెంటనే సమీపంలో ఉన్న బహానగా ఊరుకు సమాచారం అందించింది. క్షణాల్లో బహానగా ఊరంతా రైల్వే పట్టాల వద్దకు చేరింది.

ఘటనా స్థలంలో చుట్టూ చిమ్మచీకటి. మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లు వేసి చూస్తే కళ్లముందు ఘోర ప్రమాదం. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఊరు ఊరంతా యుద్ధభూమిలో సైనికుల్లో ప్రయాణికులను కాపాడటం షురూ చేశారు. మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుగులో.. ట్రైన్ బోగీల మధ్య గుట్టగుట్టలుగా పేరుకుపోయిన క్షతగాత్రులను.. మృతదేహాలను వెలికితీశారు. గాయపడి ప్రాణాలతో ఉన్నవారిని ఏది కనిపిస్తే ఆ వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చాలా వరకు క్షతగాత్రులను సైకిల్, బైకుల మీదే ఆస్పత్రులకు తరలించారు.

ప్రభుత్వ సహాయ బృందాలు వచ్చేలోపు దాదాపు రాత్రి 9 గంటల వరకూ స్థానికులే అంతా తామై వ్యవహరించారు. ఆ తర్వాత కూడా రాత్రంతా సేవలందించారు. అత్యంత కీలక సమయంలో చురుగ్గా స్పందించారు. వారే లేకుంటే బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణనష్టం ఊహకందనంత తీవ్రంగా ఉండేదని అధికారులంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news