నెల్లూరు జిల్లా: ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనం వెంకటరమణారెడ్డి పై సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించారని ఆరోపించారు టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. ఇది సుపారీ దాడి అని ఆరోపించారు. దాడి జరిగి 24 గంటలు గడిచినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మండిపడ్డారు. మా పార్టీ కార్యాలయాలపై దాడులకి కూడా సజ్జలే కారణం అన్నారు.
చంద్రబాబుపై దాడిచేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు దేవినేని ఉమా. సీఎం జగన్ అవినీతి, అసమర్ధతని నెల్లూరు యాసలో ఆనం చక్కగా మాట్లాడుతున్నారని అన్నారు. మేమంతా ఆనంని చూసి గర్వపడుతున్నామన్నారు. ఆనంపై దాడి జరిగితే మంత్రి కాకాణికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. సుపారీ ఎవరిచ్చారు..? గంజాయి బ్యాచ్ ని ఎవరు పంపించారు? మొత్తం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలు ఉంటే ఎస్పీ ఏం చేస్తున్నారని నిలదీశారు .