రద్దీగా ఉండే మెట్రోల్లో ముంబై, దిల్లీ కూడా ఒకటి. ఇక్కడ కొన్నిసార్లు కాలుపెట్టడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటిది దిల్లీ మెట్రోలో యువకులు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇలా చేసే సరికి చుట్టుపక్కల వాళ్లు వీడియో తీశారు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn
— Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ మెట్రో గత కొన్ని నెలలుగా అనేక కారణాల వల్ల వార్తలకు ఎక్కుతూనే ఉంది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బ్యాగ్‌లు ధరించిన ఇద్దరు యువకులు మెట్రో కోచ్‌లో పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ప్రయాణికులంతా వీరి ఫైట్‌కు దూరంగా ఉండగా.. కొందరు మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాత్రం అస్సలే ఆగలేదు. ఒకరినొకరు విపరీతంగా అసభ్య పదజాలం వాడుతూ దూషించుకున్నారు. కొట్టుకున్నారు.
అక్కడే ఉన్న పలువురు వీరి గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. సచిన్ భరద్వాజ్ (Sachin Bharadwaj) అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్లు వచ్చాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఓ ప్రకటన విడుదల చేసింది.మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఇతర ప్రయాణికులు ఏదైనా అభ్యంతరకరమైన ప్రవర్తనను గమనించినట్లయితే వారు వెంటనే డీఎంఆర్సీ (DMRC) హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాలని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ అన్నారు. ఇటీవల డీఎంఆర్సీ ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా ఢిల్లీ మెట్రో సంస్థ నియమించింది. వీరు మెట్రోలో జరిగే ఇలాంటి ఘటనలను పర్యవేక్షిస్తుంటారు. అలాగే సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు కూడా తీసుకుంటారు.
జానీ జానీ యస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ దీ మెట్రో నో పాపా
గతంలో ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఇటీవలే ఓ ప్రకటన చేసింది. అందులో మెట్రోలో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో జానీ జానీ యెస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో నో పాపా.. అని అడ్వైజరీలో పేర్కొంది. దీనికి ఓపెన్ యువర్ కామెరా.. నా నా నా అంటూ రాసుకొచ్చింది. ప్రయాణికులకు అసౌకర్యం కల్గించే ఇలాంటి కార్యకలాపాలను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నామని వెల్లడించింది. డీఎంఆర్సీ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.