మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనపై ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అత్యంత విచారకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు అందరికీ అవమానకరం అని అన్నారు. నిందితులపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ త్వరితగతిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. మన దేశ సంస్కృతిని కించపరిచే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి చర్చలు జరగకుండా వాయిదాల పర్వం కొనసాగడంపైనా హర్భజన్ స్పందిస్తూ.. పార్లమెంట్ లో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. దేశం ముందుకెళ్లాలంటే డిబేట్‌లు జరగడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. చర్చలు జరిగితేనే మనం కొన్నింటికి లేదా ప్రతిదానికీ అంగీకరిస్తామో, వ్యతిరేకిస్తున్నామో తెలుస్తుందని చెప్పారు. కానీ, చర్చలే లేనప్పుడు సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. అందువల్ల చర్చ జరిగేలా పార్లమెంట్ నడపాల్సిన అవసరం ఉందని హర్భజన్ సింగ్ అన్నారు.