గ్రీస్ దేశాన్ని కార్చిచ్చు అల్లకల్లోలం చేస్తోంది. కార్చిచ్చు సృష్టిస్తున్న బీభత్సంతో ఆ దేశం బూడిదైపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతున్నాయి. దీంతోపాటు గంటకు 49 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటం వల్ల మంటలు అంతకంతకూ విస్తరిస్తూ దేశాన్ని తగులబెట్టేస్తున్నాయి.. ముఖ్యంగా రోడ్స్, ఎవియా, కోర్ఫు దీవుల్లో కార్చిచ్చు విజృంభిస్తోంది. ప్రజలు, పర్యాటకులు ప్రాణభయంతో ఇళ్లు, హోటళ్లు ఖాళీ చేసి తరలిపోతున్నారు. ప్రభుత్వం వారిని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 19,000 మంది స్థానికులు, పర్యటకులను రోడ్స్ ద్వీపం నుంచి తరలించారు. గ్రీస్ దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద తరలింపు కావడం గమనార్హం. మరోవైపు మంటలను ఆర్పివేయడానికి భారీ సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది, విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. ఇందుకు యూరోపియన్ యూనియన్‌తో పాటు తుర్కియే, జోర్డాన్, ఇజ్రాయెల్, క్రొయేషియా దేశాలు సాయం అందిస్తున్నాయి. కార్చిచ్చు బీభత్సంతో ఆ దేశంలో వేల ఎకరాల భూమి, ఇళ్లు దగ్ధమయ్యాయి.