వైసిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సీఎం జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. వ్యవస్థలను చంపి రివర్స్ గేర్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. సంక్షోభానికి కారణమైన జగన్ కి పరిపాలించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు చంద్రబాబు.
మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగిస్తున్నారని.. రైతులపై ప్రేమతో తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించాయన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అన్నదాత పథకం అమలు చేసి ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని.. టిడిపి పాలనతో పోలిస్తే జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై బడ్జెట్ ను తగ్గించిందని ఆరోపించారు.