భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలతో రైలు పట్టాలపైకి, రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరుతోంది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అధికారులు.. 5 రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 40 రైళ్లను దారి మళ్లించి నడిపించారు. గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు గంటల తరబడి రైల్వేస్టేషన్లలోనే నిలిచిపోయాయి. గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి స్టేషన్‌లో గురువారం మధ్యాహ్నం 6 గంటలపాటు నిలిపేశారు. పట్టణంలోని పలు సేవాసంస్థలు ప్రయాణికులకు అల్పాహారం అందించాయి.
మరోవైపు హనుమకొండ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు పట్టాల వరకు వరద వచ్చింది. కోమటిపల్లి రైల్వే గేటు వద్ద పట్టాల మీదుగా ప్రవాహం పారింది. హసన్‌పర్తి-కాజీపేట మధ్య వరదనీరు ప్రమాదకరస్థాయిలో ట్రాక్ పైనుంచి పొంగి పొర్లింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దురంతోల దారి మళ్లింపు భారీ వానల కారణంగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను 27, 28 తేదీల్లో, సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీని 27వ తేదీకి, సికింద్రాబాద్‌కి వచ్చి వెళ్లే బీదర్ ఇంటర్‌సిటీని 27, 28 తేదీల్లో ద.మ.రైల్వే రద్దు చేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్ష నుంచి మంచిర్యాల, కాజీపేట వైపు కాకుండా దారి మళ్లించారు.