తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఊళ్లు ఏళ్లై పారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు-వరదలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను.. వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించాలని చెప్పారు.
ములుగు జిల్లాలో కొండాయి గ్రామం కూడా వరదలో చిక్కుకుంది. కొండాయిలో హెలికాప్టర్‌తో సహాయ చర్యలు చేపడుతున్నారు. మంత్రి సత్యవతి చొరవతో కొండాయిలో హెలికాప్టర్‌తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ములుగు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి సత్యవతి తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీతో వరద ప్రాంతాల పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు.
మరోవైపు భారీ వరదలతో వెంకటాపురం మండలంలోని ప్రధాన మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బోధపురం వద్ద కొండాపురం వారిధిపైకి గోదావరి వరద చేరింది. మరోవైపు నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామ శివారు వద్ద ఆకేరు వాగు వరద ధాటికి దెబ్బతిన్నది.