విశాఖ సముద్ర తీర ప్రాంతం క్రమంగా కోతకు గురవుతోందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. విశాఖ జిల్లాలో 19 శాతం, నగరంలో 22 శాతం తీరం కోతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ లో ఈ విషయం వెళ్లడైందని రాజ్యసభలో చెప్పారు.
ఆర్కే బీచ్ కోతకు గురికాకుండా ఉండేందుకు విశాఖ, గంగవరం పోర్టుల నుంచి డ్రెడ్జ్ చేసిన ఇసుకతో నింపాలని, తీర పరిరక్షణ ప్రణాళికను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనివల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బలహీనపడిన అల్పపీడనం ఉత్తర కోస్తాపై కేంద్రీకృతమైంది. దీనివల్ల కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.