సాధారణంగా విదేశాల నుంచి అక్రమంగా బంగారం, డ్రగ్స్, కరెన్సీ తరలించడం చూస్తుంటాం. కానీ ఓ ప్రయాణికుడు ఏకంగా కొండిలువలు తీసుకువచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మలేషియా లోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి తనతో పాటు 47 కొండచిలువలు, రెండు బల్లులను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అతడి బ్యాగ్‌లో ఏదో ఉన్నట్లు అనుమానించి తనిఖీ చేశామని.. అందులో పలు జాతులకు చెందిన కొండచిలువలను గుర్తించామని చెప్పారు. రంధ్రాలున్న పెట్టెల్లో వాటిని తీసుకువచ్చాడని.. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వాటిని తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.