దేశంలో పలుమార్లు సంభవించిన వరదలు, తుపానుల వల్ల భారత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. సోమవారం రోజున రాజ్యసభలో వైసీపీఎంపీ నిరంజన్‌రెడ్డి పట్టణ వరదలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. దేశంలో 2012 నుంచి 2021 వరకు సంభవించిన వరదలకు 17,422 మంది ప్రాణాలు కోల్పోగా, రూ.2.76 లక్షల కోట్ల ఆస్తినష్టం జరిగిందని వెల్లడించారు.
మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,66,794 మందికి రూ.302.49 కోట్లు, తెలంగాణలో 2,82,815 మందికి రూ.377.94 కోట్ల మేర లబ్ధి కలగజేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. కాకినాడ, హిందూపురం ఎంపీలు వంగా గీత, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇంకోవైపు.. సమగ్ర శిక్షా అభియాన్ కింద ఏపీలోని పాఠశాలలకు 1,357 బాలికల మరుగుదొడ్లు మంజూరు చేయగా 1,152 నిర్మాణం పూర్తయ్యాయని, తెలంగాణలో 1103 మంజూరు చేయగా 118 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.