ఈ ఏడాది ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు.. వర్షాలను కూడా మరింత ఆలస్యంగా తీసుకువచ్చాయి. ముఖ్యంగా దక్షిణాదిన జులై మొదటి వారం వరకు వాన జాడే కానరాలేదు. మరోవైపు ఉత్తరాదిన మొదలైన వర్షాలు అక్కడి రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా భారీ వర్షాలు.. దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలను చిగురుటాకులా వణికించాయి.
ఇక దక్షిణాదిన గత వారం పది రోజుల నుంచి తెలంగాణను భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెట్టాయి. ఓవైపు వర్షాలు..మరోవైపు ఎగువ నుంచి వచ్చిన వరదతో రాష్ట్రమంతా వరదమయమైంది. చాలా చోట్ల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. అయితే నిన్నటివరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన దేశంలో రానున్న రెండు నెలలపాటు (ఆగస్టు, సెప్టెంబర్లో) సాధారణ స్థాయి వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
దేశంలోని తూర్పు మధ్య ప్రాంతాలతోపాటు ఈశాన్య, హిమాలయ ప్రాంతాల్లోని చాలా సబ్డివిజన్లలో సాధారణ స్థాయి నుంచి అంతకంటే అధిక స్థాయి వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. ద్వీపకల్ప భాగంతోపాటు పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.