తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయనకు నివాళులర్పించిన శాసనసభ.. సంతాప తీర్మానాన్ని బలపర్చింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఈ సమావేశాల్లో భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో దాదాపు పది బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అయితే ప్రభుత్వ నిర్ణయంతో కాంగ్రెస్ ఏకీభవించలేదు. కనీసం 20 రోజుల పాటైనా సమావేశాలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మరోవైపు.. అసెంబ్లీలో చర్చ సజావుగా సాగేలా చూడాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఇండియా కూటమి పేరిట పార్లమెంట్ జరగనివ్వడం లేదని గుర్తు చేశారు.