భర్త చనిపోయి.. ఒంటరిగా ఉంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని లోబరుచుకున్నాడు. తీరా అవసరం తీరాక ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని నిలదీసిన ఆ యువతిని నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేసి హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన భూక్యా ప్రమీల (23) ఇంటర్ పూర్తిచేసి కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. 2022 జనవరిలో ఆమెకు వివాహం కాగా ఏప్రిల్‌లో భర్త చనిపోయాడు. నగరంలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు యువతులతో కలిసి ఉంటూ బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పనిచేస్తున్నాడు. తన సొంతూరు సమీపంలోని రోడ్బండ తండాకు చెందిన భూక్యా తిరుపతినాయక్ (25)తో చిన్ననాటి నుంచే పరిచయముంది. నగరంలోని కొండాపూర్‌లో ఉంటూ కారుడ్రైవర్‌గా పనిచేసే అతనితో పరిచయం ప్రేమకు దారితీసింది.
తిరుపతికి ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం జరగడంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు .. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. ఆదివారం ఉదయం కలవాలని ఆమె కోరగా.. తిరుపతి ద్విచక్రవాహనంపై మరో మిత్రుడితో వెళ్లి, బాచుపల్లి ప్రధాన రహదారి వద్ద కలిశాడు. పెళ్లి విషయంపై ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నిందితుడు ఆమెను అటుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.