భక్తులకు అలర్ట్. అన్నవరం వెళ్లే భక్తులు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే.. అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేదట. ఈ నిబంధనను తాజాగా అధికారులు అమల్లోకి తీసుకువచ్చారు. వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు. ఇలా ఒక ఆధార్ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపునకు అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు.
మరోవైపు భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసే సమయంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఏయే వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి, ఇందులో ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలతో కొండ దిగువున సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులు ఈ విషయం గమనించి ఆలయ నిర్వాహకులకు సహకరించాలని కోరారు.