టిడిపి అధినేత నారా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం సీఎం జగన్ పిరికితనానికి నిదర్శనం అని మండిపడ్డారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోడ్ షోకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే జగన్ అసహనానికి గురై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. చిత్తూరు జిల్లాలోని అల్లర్లలో తెరవెనక ఉన్నది కూడా జగనేనని అన్నారు.
ఇటువంటి దాడులతో టిడిపిని ఎంత మాత్రం ఆపలేరన్నారు. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయనపై కేసు పెట్టారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పర్యటిస్తున్న రూట్ లో వైసీపీ వాళ్లకు ఏం పని..? అని ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు ఎలా అనుమతిస్తారని విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టడం జగన్ కే చెల్లిందన్నారు.