కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంలో రాహుల్.. అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ వెళుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపణలు చేశారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది’ అంటూ స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ.. బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లేఖపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.