కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలోనే మరో దేశంలో పర్యటించనున్నారు. రాహుల్.. యూరప్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో యూరప్‌లోని పలు దేశాలను ఆయన సందర్శించనున్నట్లు తెలిసింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ.. యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో సమాచారం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రవాస భారతీయులు, విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశం అవుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. బెల్జియం, నార్వే, ఫ్రాన్స్ దేశాలను సందర్శిస్తారని తెలిపాయి.
రాహుల్ గతంలో పది రోజుల పాటు అమెరికా పర్యటన చేశారు. అందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా అక్కడి చట్టసభ సభ్యులు, ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఆ పర్యటనలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు రాహుల్ గాంధీ. అంతా తమకే తెలుసని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.