విశాఖ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అప్పజెప్పనున్నట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన పార్టీ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయని తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంవీవీ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు అధిష్ఠానం పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎంపీ.. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు(జీవీ)తో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజున సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అక్కరమాని విజయనిర్మల తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీచేసే అవకాశాలున్నట్లు సమాచారం.
విశాఖ తూర్పు టికెట్టు కోసం ఇప్పటికే ముగ్గురు ఆశిస్తున్నారు. దీని కోసం వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మధ్య గత కొంతకాలంగా పోటీ ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను విశాఖలో నిలబెట్టేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది.