యూట్యూబ్లో చూసి వంటలు చేసుకుంటారు, ఏదైనా తెలియకపోతే ఎలా చేయాలో యూట్యూబ్లో చూస్తాం, చదువుకుంటారు.. కానీ ఓ వ్యక్తి యూట్యూబ్లో చూసి భార్యకు నార్మల్ డెలవరీ చేయాలనుకున్నాడు. కానీ అతను చేసిన పనికి భార్య చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో జరిగింది.
భార్యకు నార్మల్ డెలవరీ కావాలని ఓ భర్త చేసిన ప్రయోగం వికటించింది. చివరకు ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. లోకనాయకి అనే యువతికి మాదేశ్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అగ్రికల్చరల్ బీఎస్సీ చేసిన దంపతులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సహజమైన పద్దతిలో జీవించాలని ఇంటి ఆవరణలో సేంద్రియ విధానంలో ఆకు, కూరలు, కూరగాయలు పండిస్తూ వాటినే తింటున్నారు. లోకనాయకి గర్భవతి కావడంతో ..ఆమె సహజ పద్దతిలో ప్రసవించాలని మాదేశ్ తెలిసి తెలియని పని చేశాడు. యూట్యూబ్లో నార్మల్ డెలవరీ వీడియో చూస్తూ భార్యకు పురుడు పోయాలనుకున్నాడు. అతని ప్రయోగం వికటించడంతో అధిక రక్తస్రావమై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
ప్రసవం విషయంలో కూడా డాక్టర్లపై ఆధారపడకుండా ..సహజ పద్దతిలో బిడ్డకు జన్మనివ్వాలని ఇంట్లోనే ప్రసూతి ఏర్పాట్లు చేసుకున్నారు. యూట్యూబ్లో నార్మల్ డెలవరీ విధానం వీడియో చూస్తూ లోకనాయకి ప్రసవం చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. బిడ్డ ప్రసవించిన తర్వాత లోకనాయకికి తీవ్రరక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు మాదేశ్. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు. అయితే మాదేశ్ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికి అసలు నిజం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రులు తన అల్లుడికి మూర్ఖత్వమో, అమాయకత్వమో తెలియక తలలు బాదుకుంటున్నారు.
ఇలా తెలిసి తెలియక చేసిన పనికి.. ఓ నిండు ప్రాణం పోయింది. మరోవైపు.. ఆ పసిబిడ్డను తల్లిని కోల్పోయింది. తల్లి లేకుండా ఇప్పుడు ఈ బిడ్డ పెరగాలి. అది ఎంత కష్టం..! టెక్నాలజీని వాడుకోవాలి కానీ.. ఇలా వెర్రిగా ప్రాణాల మీదకు తెచ్చుకోకూకడదు. వైద్యులకు, వైద్యానికి దూరంగా ఇంటి దగ్గరే ఉండే బతికేస్తాం అంటే అది అన్ని విషయాల్లో సాధ్యం కాదు.